21, జనవరి 2013, సోమవారం

తాండూరు (Tandur)

తాండూర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక ప్రముఖ పట్టణము, మండలము. రంగారెడ్డి జిల్లాలో పశ్చిమాన ఉన్న ఈ పట్టణము పారిశ్రామికపరంగా నాపరాళ్ళకు మరియు వ్యవసాయపరంగా కందులకు ప్రసిద్ది. మూడవ గ్రేడు పురపాలకసంఘంచే పట్టణ పాలన నిర్వహించబడు తాండూరు పట్టణమునకు రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి రోడ్డు మరియు రైలు పరంగా మంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాదుకు పశ్చిమాన 116 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది. రాజకీయంగా కూడా మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, మాజీ మంత్రులు ఎం.మాణిక్ రావు, ఎం.చంద్రశేఖర్ లాంటి ప్రముఖులు తాండూరు నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించారు. పట్టణం సమీపంలో పలు సిమెంటు కర్మాగారాలు కలవు. పట్టణానికి తాగునీరు అందించే కాగ్నానది, దాని సమీపంలోనే వ్యవసాయ పరిశోధన కేంద్రం పట్టణానికి 4 కిలోమీటర్ల దూరాన ఉన్నాయి. షాబాద్ నాపరాయిగా ప్రసిద్ధి చెందిన తాండూరు ప్రాంతంలో లభ్యమయ్యే నాపరాతికి దేశవిదేశాలలో మంచి డిమాండు ఉంది.

పట్టణ స్వరూపం, జనాభా
తాండూరు పట్టణము హైదరాబాదు నుండి 110 కిలోమీటర్ల దూరంలో, రంగారెడ్డి జిల్లాలో పశ్చిమభాగంలో ఉన్నది. 2001 జనాభా లెక్కల ప్రకారం తాంఢూరు పట్టణం జనాభా 57,943. ఇందులో పురుషులు 51% మరియు మహిళలు 49% ఉన్నారు. పట్టణం సగటు అక్షరాస్యత 60% (జాతీయ సగటు 59.5%). పురుషులలో అక్షరాస్యత 67%, మహిళలలో 52% ఉంది. మొత్తం జనాభాలో 15% మంది ఆరేళ్ళలోపు వయసు గలవారు.

రాజకీయాలు
రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు. ఇంతకు క్రితం ఈ నియోజకవర్గం హైదరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. పునర్విభజన ఫలితంగా నూతనంగా ఏర్పడిన చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరియు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి ఇక్కడి నుండి రెండు సార్లు పోటీచేసి విజయం సాధించాడు. గతంలో రాష్ట్రమంత్రులుగా పనిచేసిన మాణిక్ రావు మరియు చంద్రశేఖర్‌లు కూడా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆదినుంచి కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కల తాండూరు నియోజకవర్గంలో 1994 తర్వాత తెలుగుదేశం పార్టీ 3 సార్లు విజయం సాధించింది.

తాండూరు పట్టణ చరిత్ర
తాండూరు పట్టణానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1953 కు పూర్వం ఇది నిజాంరాష్ట్రం లో భాగంగా ఉన్న గుల్బర్గా జిల్లాలో ఉండేది. 1953 లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో హైదరాబాదు జిల్లాలో కలిసింది. 1956 లో భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ లో భాగమై 1978 వరకు హైదరాబాదు జిల్లాలోనే కొనసాగింది. 1978 లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయడంతో ఇది ఈ జిల్లాలో భాగమై కొనసాగుతోంది. రాష్ట్ర అవతరణ నుంచే తాండూరు తాలుకా కేంద్రంగా ఉంది. 1986లో మండల వ్యవస్థ ప్రారంభం కావడంతో తాండూరు మండల కేంద్రంగా మారింది. 1953 లోనే పట్టణ పాలనకై పురపాలక సంఘం ఏర్పడిది.

పట్టణ పాలన
తాండూరు పట్టణ పరిపాలన పురపాలక సంఘం ద్వారా నిర్వహించబడుతుంది. 1953, నవంబర్ 23న ఇక్కడ పురపాలక సంఘం ఏర్పాటుచేయబడింది. మొదటి పురపాలకసంఘం చైర్మెన్‌గా ముధెళ్ళి నారాయణరావు పనిచేశాడు. 1961 లో పట్టణ జనాభా కేవలం 2000 ఉండగా నేడు సుమారు 60 వేలకు పైగా జనాభాతో విలసిల్లుతోంది. నాపరాతి గనులు, పాలిష్ మిషన్ల వల్ల అనేక మంది జీవనోపాధి కొరకు మారుమూల పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. పాలిష్ మిషన్ల వల్ల మున్సీపాలిటీకి అధిక మొత్తంలో ఆదాయం కూడ వస్తుంది. అలాగే భవన నిర్మాణాల పరిశ్రమల ఏర్పాటు అనుమతులకు మునిసిపాలిటీకి అనుమతి ఫీజు లభిస్తుంది. ప్రస్తుతం పట్టణ పరిధిలో 32 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డు తరఫున ఒక వార్డు మెంబర్ (కౌన్సిలర్) పురపాలక సంఘంలో ఆ వార్డు తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రజల సమస్యలను పరిష్కరించుటకు కృషిచేస్తాడు.

వ్యవసాయం, నీటిపారుదల
తాండూరు పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో కాగ్నానది ఉన్నది. ఇది మూసీనదికి ఉపనది. ఈ నది నుంచే మహబూబ్ నగర్ లోని కోడంగల్ మున్నగు ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తారు. తాండూరు ప్రాంతంలో అత్యధికంగా సాగుచేసే పంట కందులు. 6వేల హెక్టార్లకు పైగా ఖరీబ్‌లో సాగుచేయగా, రబీలో వరిపంట సేద్యం చేస్తారు. జొన్నలు, కూరగాయల సాగు కూడా ఎక్కువగా ఉంటుంది.

తాండూరు కంది పప్పు
మంచి మాంసకృత్తులు పౌష్టికాహారం కల్గిన కందిపప్పు ఉత్పత్తిలో తాండూరు పేరెన్నికగన్నది. కందిపప్పు ఉత్పతిలో తాండూరు రాష్ట్రంలోనే ప్రముఖ స్థానం ఆక్రమిస్తుంది. నల్లరేగడి భూముల్లో పెరిగే కంది పంటకు ఇక్కడి భూములు అనువుగా ఉండటం మరియు రైతులు ఆసక్తి చూపడంతో పంట ఉత్పత్తి బాగుగా జర్గుతుంది. ఈ పంటకు వర్షాకాలం ఆరంభంలో విత్తనాలు చల్లుతారు. నవంబర్ చివరి నాటికి పంట మార్కెట్ లోకి వస్తుంది. పూర్తిగా ఎండని, కాయ దశలోనే ఉన్న కంది కాయలను రైతులు మార్కెట్ లో తెచ్చి అమ్మడం, దాన్ని ఉప్పు వేసిన నీటిలో ఉడకబెట్టి దాని విత్తులను తినడం ఇక్కడ మాత్రమే కన్పించే అపురూప దృశ్యం.

తాండూరు వ్యవసాయ పరిశోధన సంస్థ
తాండూరు పట్టణ సమీపంలో కోడంగల్ వెళ్ళు రహదారిలో కాగ్నానది ప్రక్కన వ్యవసాయ పరిశోధన సంస్థ ఉన్నది. దీనిని 1989లో స్థాపించారు. మహబూబ్ నగర్ జిల్లా పాలెం కేంద్రానికి అనుబంధంగా ఉన్న ఈ పరిశోధన సంస్థలొ తాండూరు పరిసర ప్రాంతాలలో పండే కంది, కుసుమ, జొన్న, ఆముదం తదితర పంటలపై పరిశోధనలు చేస్తుంటారు. కొత్త వంగడాలు, ఎరువుల వాడకం తదితర అంశాలపై పరిశోధనలు చేసి రైతులకు సూచనలిస్తుంటారు.

వర్షపాతం
తాండూరు మండల సాధారణ వర్షపాతం 89.8 సెంటిమీటర్లు. 2005-06లో 127.6 సెం.మీ.వర్షపాతం రికార్డు అయింది. వర్షపాతం అధికంగా జూన్ నుండి ఆగష్టు మాసములలో నైరుతి రుతుపవనాల వల్ల కురుస్తుంది. 2009 అక్టోబరులో భారీ వర్షాలకు పలు గ్రామాలు, వీధులు జలమయం అయ్యాయి. భారీ వర్షాల సమయములో మహబూబ్ నగర్ వైపు వెళ్ళే దారిలో ఉన్న కాగ్నానది ఉప్పొంగి రవాణా నిలిచిపోతుంది.

జనాభా
1991 లెక్కల ప్రకారం మండల జనాభా 83358 కాగా 2001 నాటికి జనాభా 103278 అయింది. జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటరుకు 383. స్త్రీ పురుష నిష్పత్తి 981. పెరుగుదల రేటు 23.9%. మండలంలో పట్టణ జనాభా 57941 కాగా, గ్రామీణ జనాభా 45337.

వ్యాపారం, పరిశ్రమలు
ఇక్కడి నుండి భవనాల నిర్మాణంలో ప్లోరింగ్ కు వాడే నాపరాయి షోలాపూర్, ముంబాయి, హైదరాబాదు మున్నగు ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. కంది పంట వల్ల ఇక్కడ దాల్ మిల్లులు కూడ అధిక సంఖ్యలోనే ఉన్నాయి. కల్తీ లేని స్వచ్ఛమైన కందులకు ఇక్కడి మార్కెట్ ప్రసిద్ధి. పరిసర ప్రాంతాలలో కూడ తాండూరు కందికి విపరీతమైన డిమాండు ఉంది.

పాలిషింగ్ పరిశ్రమ
భవనాల నిర్మాణంలో ఫ్లోరింగ్‌కు వాడే నాపరాతి పరిశ్రమకు తాండూర్ ప్రసిద్ధి చెందినది. గనుల నుంచి ముడి రాళ్ళను తీయడం ఒక ఎత్తయితే దానికి మెరుగులు దిద్ది భవనాల నిర్మాణంలో ప్లోరింగ్ కు అనువైన రీతిలో మలచడం మరో ఎత్తు. తాండూర్ పట్టణములోనే కాకుండా పరిసర ప్రాంతాలలో కూడా ఈ పరిశ్రమ విస్తరించి ఉన్నది. సిరిగిరిపేట్, ఓగిపూర్, మల్కాపూర్, కరణ్‌కోట్, బషీరాబాద్‌ ప్రాంతాలలో నాపరాతి గనులు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. గతంలో బంజరు భూములుగా వదలిచేసిన ఈ ప్రాంతాలు ప్రస్తుతం కనకపు కాసులు వెదజల్లుతున్నాయి. ఈ పరిశ్రమ వల్ల అధిక సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది, కార్మికులకు, జీవనోపాధి లభిస్తుంది, వాహనాలకు గిరాకీ పెరుగుతుంది. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో ఆదాయం లభిస్తుంది, యంత్రపరికరాలు తయారు చేయువారికి, మెకానిక్ లకు మంచి డిమాండు ఉంటుంది. ఈ విధంగా తాండూరు పట్టణము అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం లభిస్తున్నది.

తాండూర్ సిమెంటు పరిశ్రమ
తాండూరులో రెండు భారీ సిమెంటు కర్మాగారాలున్నాయి. ఒకటి విశాఖ సిమెంట్ ఇండస్ట్రీస్‌కు చెందినది. మరొకటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు చెందినది. తాండూర్ రైల్వే స్టేషన్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాదు రైల్వేస్టేషన్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో కరణ్‌కోట గ్రామం పరిధిలో భారత ప్రభుత్వ రంగ సంస్థ అజమాయిషీలోని సిసిఐ సిమెంటు కర్మాగారం 1987లో ఉత్పత్తి ప్రారంభించబడింది. ఇది 2340 ఎకరాల వైశాల్యంలో విస్తరించబడి ఉన్నది. సి.సి.ఐ.కు దేశవ్యాప్తంగా ఉన్న 11 సిమెంటు ప్లాంట్లలో ఇది ఒకటి.

పారిశ్రామిక కాలుష్యం
సిమెంటు కంపెనీల మరియు నాపరాతి పరిశ్రమలవల్ల తాండూరు మండలంలో ప్రజలకు కాలుష్యం సమస్య తెలెత్తుతోంది. పరిశ్రమలు పారిశ్రామిక వ్యర్థాలు మరియు కాలుష్య జలాలను వదలడంతో పశువులు మృత్యువాత పడుతున్నాయి కార్మికులకు చర్మవ్యాధులు వస్తున్నాయి. చర్మం బొబ్బలెక్కుతోంది.

బ్యాంకులు
మండలంలో 6 జాతీయ బ్యాంకులు కలవు. దీనితో పాటు ఒక్కొక్క దక్కన్ గ్రామీణ బ్యాంకు మరియు సహకార బ్యాంకు శాఖలు కూడా ఉన్నాయి. మల్కాపూర్‌లో స్టేట్ బ్యాంక్ మినహా మిగితా అన్ని బ్యాంకులు తాండూరు పట్టణంలో ఉన్నాయి. తాండూరు పట్టణంలో స్టేట్ బ్యాంకు మరియు ఆంధ్రాబ్యాంకుకు చెందిన ఏ.టి.ఎం.లు అందుబాటులో ఉన్నాయి.
రవాణా సదుపాయాలు
రవాణా పరంగా తాండూరుకు రైలు మరియు రోడ్డురవాణాకు మంచి సౌకర్యాలు కలవు.

రైలు రనాణా
తాండూరు రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జొన్‌లో హైదరాబాదు నుంచి కర్ణాటక లోని వాడి రైలుమార్గము లో హైదరాబాదు కు పడమరన 110 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా మహబూబ్ నగర్ మరియు మెదక్ జిల్లా ప్రజలు కూడా ముంబాయి వైపు వెళ్ళడానికి ఈ రైల్వేస్టేషన్‌ నుంచే బయలుదేరుతారు. తిరుపతి, బెంగుళూరు, ముంబాయి మున్నగు ప్రాంతాలు వెళ్ళడానికి ఈ స్టేషన్ అనువుగా ఉన్నది. హైదరాబాదు నుండి తాండూరుకు లోకల్ రైలు కూడా నడుస్తుంది.

రోడ్డు రవాణా
బస్సులు కూడ హైదరాబాదు మరియు మహబూబ్ నగర్ మున్నగు పట్టణాల నుంచి ప్రయాణానికి మంచి వసతులున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు బస్సులు తాండూరు నుండి రాష్ట్ర రాజధానికి, మరియు జిల్లాలో అన్ని ప్రధాన పట్టణాలకు నడుపుతున్నారు. హైదరాబాదు, మహబూబ్ నగర్, గానుగాపూర్, విజయవాడ, గుడివాడ, ముంబాయి, థానె, శ్రీశైలం, యాదగిరిగుట్ట - ఇక్కడి నుండి బస్సు సర్వీసులున్న ప్రధాన పట్టణాలు.

వాయురవాణా
తాండూరుకు సమీపంలోని విమానాశ్రయము శంషాబాదులోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము. ఇది పట్టణానికి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
విద్య, వైద్యం
మండలంలో 5 ప్రభుత్వ పాఠశాలలు, 40 మండల పరిషత్తు పాఠశాలలు, 19 ప్రైవేటు పాఠశాలలు (ఇందులో 6 ఎయిడెడ్) ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు మొత్తం 7 జూనియర్ కళాశాలలు, 4 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

తాండూరు పట్టణంలోని విద్యాసంస్థలు
డిగ్రీ కళాశాలలు
  • పీపుల్స్ డిగ్రీ కళాశాల
  • శ్రీసాయి డిగ్రీ కళాశాల
  • శాలివాహన డిగ్రీ కళాశాల

జూనియర్ కళాశాలలు
  • ప్రభుత్వ జూనియర్ కళాశాల
  • విజ్ఞాన్ జూనియర్ కళాశాల
  • చైతన్య జూనియర్ కళాశాల
  • అంబేద్కర్ సెంటినరీ జూనియర్ కళాశాల
  • సిద్ధార్థ జూనియర్ కళాశాల
  • సింధు బాలికల్ జూనియర్ కళాశాల

   

పాఠశాలలు

  • ప్రభుత్వోన్నత పాఠశాల నెం.1
  • విజయ విద్యాలయ హైస్కూల్
  • సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ (శివాజీ చౌక్)
  • సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల
  • తాండూర్ ప్రొగ్రెస్సివ్ హైస్కూల్ (గాంధీనగర్)
  • విద్యాభారతి హైస్కూల్ (వాల్మికీనగర్)
  • శివసాగర్ విద్యాలయ హైస్కూల్ (సాయిపూర్)
  • బ్రిలియంట్ కాన్వెంట్ హైస్కూల్
  • సెయింట్ మార్క్స్ హైస్కూల్
  • కోటేశ్వర హైస్కూల్ (పాత తాండూర్)
  • కన్యా పాఠశాల హైస్కూల్
  • విలియం మూన్ హైస్కూల్
ఆలయాలు, చూడదగిన స్థలాలు
శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం
తాండూరు పట్టణ నడిబొడ్డున ఉన్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం కోర్కెలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఉత్సవాలు జర్గుతాయి. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి తాండూరు, వికారాబాదు, పర్గి, బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల్, కోడంగల్, కోస్గి నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా విపరీతంగా వస్తుంటారు. శని, ఆది వారాల్లో జర్గే రథోత్సవం, లంకా దహనం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు అత్యుత్సాహంతో అర్థరాత్రి నుంచి తెల్లవారు ఝామువరకు వేచిఉంటారు. శనివారం అర్థరాత్రి జర్గే రథోత్సవంలో 50 అడుగులు ఎత్తు గల రథాన్ని వందలాది భక్తులు తాళ్ళతో లాగుతూ బసవన్న కట్ట వరకు తీసుకువెళ్ళి మరలా యధాస్థానానికి చేరుస్తారు. ఆదివారం అర్థరాత్రి జర్గే లంకాదహన కార్యక్రమంలో రకరకాల ఆకారాలు, డిజైన్లు ఉన్న బాణాసంచా కాలుస్తారు. ఇది చూడముచ్చటగా ఉంటుంది.


తాండూరు పరిసరాలలో చూడదగిన ప్రదేశాలు
  • శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం
  • రసూల్‌పూర్ హనుమాన్ దేవాలయం - తాండూరుకు 4 కిలోమీటర్ల దూరంలో కోడంగల్ వెళ్ళు రహదారి ప్రక్కన కాగ్నానది ఒడ్డున ఉంది.
  • జుంటుపల్లి రామాలయము - తాండూరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన దేవాలయం.
  • జుంటుపల్లి ప్రాజెక్టు
  • కాగ్నానది - తాండూరు పట్టణానికి, చుట్టుప్రక్కల షుమారు 45 గ్రామాలకు మంచినీరు అందించే నది. ఇది మూసీనదికి ఉపనది.
  • కోట్ పల్లి ప్రాజెక్టు
  • అనంతగిరి కొండలు - హైదరాబాదు వెళ్ళు రహదారిలో వికారాబాదు వద్ద ఉన్న ఎత్తయిన ప్రకృతి రమణీయ దృశ్యాలు కల కొండలు, ఇది మూసీనదికి జన్మస్థానం. ఇక్కడ ప్రముఖమైన అనంత పద్మనాభస్వామి దేవాలయం ఉంది.
  • ముర్షద్ దర్గా - తాండూరు పట్టణం మధ్యలో ఉంది. ఏటా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.
  • అల్లాపూర్ ప్రాజెక్టు -
  • కొత్లాపూర్ ఎల్లమ్మ దేవాలయం - కర్ణాటక సరిహద్దులో ఉన్న కొత్లాపుర్‌లో కోటి రూపాయల వ్యయంతో కర్ణాటక రాష్ట్రమంత్రి సొంత ఖర్చుతో పునరుద్ధరిస్తున్న ఆలయం ఉంది.
  • రేణుకా నాగఎల్లమ్మ దేవాలయం - తాండూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఈ దేవాలయం ఉంది. ఏటా ఇక్కడ జాతర నిర్వహిస్తారు.

తాండూరు పట్టణ ప్రధాన ఘట్టాలు
  • 1953: తాండూరు పురపాలక సంఘం ఏర్పాటైంది. తొలి చైర్మెన్‌గా ముధెళ్ళి నారాయణరావు నియామకం.
  • 1957: తాండూరు పట్టణానికి విద్యుత్ సౌకర్యం కల్పించబడింది.
  • 1960: పట్టణంలో టెలిఫోన్ ఎక్ఛేంజీ ఏర్పాటుచేయబడింది.
  • 1981: కొత్త బస్టాండు ప్రారంభమైంది.
  • 2002: పట్టణ పరిధి 5.82 చ.కి.మీ. నుంచి 18.25 చ.కి.మీ.కు పెంచబడింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక