11, ఏప్రిల్ 2013, గురువారం

మా మాట

మన పాలమూరు జిల్లా అనగానే మిగితా జిల్లాల వారు కరువు జిల్లాగానో, వలస కూలీలకు పేరుపొందిన జిల్లాగానో అర్థం చేసుకునే వారే ఎక్కువ. చారిత్రాత్మకంగానూ, సాహితీపరంగానూ, భౌగోళికంగానూ, అధ్యాత్మికంగానూ, ఆర్థిక, విద్యా, రాజకీయ, కళారంగాల పరంగా పరిశీలించి చూస్తే ఈ జిల్లా విశిష్టత ఏమిటో తెలుస్తుంది.

సాహితీపరంగా చూస్తే తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణ కర్త గోనబుద్ధారెడ్డి ఇక్కడివాడే. తొలి తెలుగు జంట కవులు మనవారే. సాహిత్యాన్ని పెంచి పోషించిన గద్వాల, వనపర్తి సంస్థానాలు మనవే. తిరుపతి వేంకటకవులను వాదనలో ఓడించిన ఘనత వనపర్తి సంస్థాన కవులకే దక్కింది. తెలంగాణలో కవులే లేరని హేళన చేయగ 354 కవుల విశేషాలతో సంచికనే తెచ్చిన సురవరం మనవాడే. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందిన గడియారం ఇక్కడే స్థిరపడి పేరుపొందగా, కపిలవాయి లాంటి ఉద్ధండులు ఇప్పటికీ సాహితీపోషణ చేస్తున్నారు.

రాజకీయంగా చూస్తే హైదరాబాదు రాష్ట్ర ఏకైక ముఖ్యమంత్రి బూర్గులను అందించిన జిల్లా మనదే. గవర్నరుగా పనిచేసిన సత్యనారాయణ, ప్రస్తుతం కేంద్రమంత్రివర్గంలో ఉన్న జైపాల్ రెడ్డి మన జిల్లా వారే. ఎన్టీ రామారావును సైతం ఓడించిన పేరు మనజిల్లాకే దక్కుతుంది. రాష్ట్రంలో తొలిసారిగా ఒకేసారి శాసనసభ్యులైన ఘనత పొందిన సీతా, దయాకర్లు మనవారే. ప్రస్తుతం సీపిఐ జాతీయ కార్యదర్శిగా ఉన్న సురవరం సుధాకర్ రెడ్డి ఇక్కడివారే.

చరిత్ర ప్రకారం చూస్తే వర్థమానపురం, ఇంద్రకల్లు, కందూరు, గంగాపురం, మగతల, బూదపురం, కొనదుర్గం, అమరావతిపురం, బుద్ధారం, ఘనపురం లాంటివి చరిత్రలో ఘనకీర్తి పొందిన చారిత్రక ప్రాంతాలు. వందకు పైగా ప్రాచీన శాసనాలు, వేలసంఖ్యలో శిలావిగ్రహాలు జిల్లాలో బయటపడ్డాయి. క్రీస్తుపూర్వ కాలానికి చెందిన ప్రాచీన మానవులు నివశించిన అవశేషాలు, రాతిపరికరాలు బయల్పడిన ప్రదేశాలౌ అనేకం జిల్లాలో ఉన్నాయి. ఆధునిక యుగంలో చూసిననూ రాష్ట్రంలో అత్యధిక సంస్థానాలు కలిగిన జిల్లా మనదే. విస్తీర్ణం ప్రకారం చూస్తే గద్వాల సంస్థానం హైదరాబాదు రాజ్యంలోనే పెద్దది. సమరయోధులలో మనవారు లెక్కలేనంత ఉన్నారు. బూర్గుల, సురవరం, కళ్యాణి రాంచంద్రారావు, మందుముల నరసింగరావు, వందేమాతరం రామచంద్రారావు, పాగపుల్లారెడ్డి, చిట్టెం నర్సిరెడ్డి, శ్రీనివాసరావు, బెల్లంనాగన్న లాంటి తదితరులు చేసిన సేవలు తక్కువేమీ కాదు.

అధ్యాత్మికంగా చూస్తే మన్యంకొండ, కురుమూర్తి, ఆలంపూర్, గంగాపురం, ఉమామహేశ్వరం, సిర్సనగండ్ల, శ్రీరంగాపురం, మల్డకల్ లాంటివి జిల్లాలో ప్రసిద్ధమైనవి. అష్టాదశ శక్తిపీఠాలలో తెలంగాణలో ఏకైక శక్తిపీఠం ఆలంపూర్‌లో ఉంది. శ్రీశైలం ఉత్తర ద్వారంగా భాసిల్లే ఉమామహేశ్వరం అచ్చంపేట సమీపంలో ఉంది, అపర భద్రాద్రిగా పేరుపొందిన సిర్సనగండ్ల, తమిళనాడులోని శ్రీరంగం నమునాకు కలిగిన శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం, ఆదిశిలాక్షేత్రంగా పేరొందిన మల్డకల్, తిరుపతి ఏడుకొండల స్వామితో పోలికలున్న కురుమూర్తి ఆలయం ఈ జిల్లాలోనివే.

భౌగోళికంగా చూస్తే మనది రాష్ట్రంలోనే రెండో పెద్ద జిల్లా, మండలాల సంఖ్యలోనూ రెండోస్థానంలో ఉంది. కృష్ణా, తుంగభద్రలు రాష్ట్రంలో ప్రవేశించేవి మన జిల్లా నుంచే. నదుల తీరాల వెంబడి లెక్కలేనన్ని అధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలున్నాయి. దేశంలోనే అతిపొడవైన 44వ నెంబరు జాతీయ రహదారి జిల్లా గుండా 200 కిమీ పొడవున విస్తరించి ఉంది.

ఆర్థికంగా ఒకప్పుడు మనది చిట్టచివరి స్థానం. ఇటీవలి కాలంలో అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది. కొత్తూరు, షాద్‌నగర్, బాలానగర్, ఆమనగల్, మండలాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రారంభమైన సెజ్ పోలెపల్లి జడ్చర్ల మండలంలో ఉంది.

విద్యాపరంగానూ మన జిల్లా అభివృద్ధి చెందుతోంది. విశ్వవిద్యాలయంతో పాటు పలు సాంకేతిక కళాశాలలున్నాయి. ఇతర జిల్లాల వారుసైతం ఇక్కడకు వచ్చి అభ్యసిస్తున్నారని చెపుకోవడానికి మనం గర్వపడాలి.

కళారంగాల గురించి ఎంతచెప్పిననూ తక్కువే. పూర్వకాలం నుంచి ఇప్పటి పల్లెర్ల రామ్మోహనరావు వరకు జిల్లాలో పేరుపొందిన కళాకారుల వివరాలతో దుప్పల్లి శ్రీరాములు గారు ఒక గ్రంథమే రచించారంటే ఇక్కడి కళాకారుల ప్రతిభ ఏమిటో తెలుస్తోంది.

సామాజిక ఉద్ధరణలోనూ మనవారు తక్కువకారు. అనేక సామాజిల ఉద్యమకారులు తర్వాతి కాలంలో రాజకీయాలలో ప్రవేశించి సేవలందించారు. వినోబాభావే భూదానోద్యమంలో భాగంగా మనజిల్లా పర్యటిస్తున్నప్పుడు పల్లెర్ల హన్మంతరావు లాంటి వారు 50వేల ఎకరాల భూమిని సేకరించి దానం చేశారు.

ఇలా ప్రతిరంగంలో మనజిల్లా ప్రత్యేక ఉనికిని నిలుపుకుంది. మరికొన్నేళ్ళలో మరింత ప్రగతిపథంలో పయనించి అన్ని రంగాలలో జిల్లా రూపురేఖలే మారిపోయే అవకాశమూ ఉంది. కాని ఏ గ్రంథం చూసిననూ మన జిల్లా పేరు కనిపించదు. పోటీపరీక్షల ప్రశ్నపత్రాలను గమనిస్తే మన జిల్లా ప్రశ్నలే ఉండవు. వ్యక్తులంటే బూర్గుల, సురవరమే, ప్రదేశాలంటే ఆలంపూర్, గద్వాల కోట తప్ప మిగితాయి ఎక్కడా కనిపించవు, వినిపించవు. కాబట్టిజిల్లా ప్రత్యేకతల గురించి తెలియజేయడం, వెలుగులోకి రాని ప్రత్యేకతలను పరిశోధించి బయటపెట్టడం లాంటి ఉద్దేశ్యంతో మేము చేస్తున్న చిన్న ప్రయత్నమే ఇది. దీనిని జిల్లా వాసులు ఆదరిస్తారని, అభిలషిస్తారని, మరింత సమాచార విస్తరణకు సహకరిస్తారని కోరుకుంటున్నాను.

సి.చంద్రకాంత రావు, పాలమూరు
cckrao2000@yahoo.co.in 
Dt: 10-10-2012

1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక